శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ చేసిన అనేకమైన స్తోత్రములలో, కీర్తనలలో బాగా ప్రాశస్త్యం పొందిన స్తోత్రం స్కంద షష్ఠి కవచం. ఈ కవచం తమిళ నాట చాలా చాలా ప్రసిద్ధి పొందిన స్తోత్రము. ఈ కవచమును వ్రాసిన వారు శ్రీ దేవరాయ స్వామి వారు. ఈ స్కంద షష్ఠి కవచమును ప్రతీ సంవత్సరము స్కంద షష్ఠి ఉత్సవాలు జరిగే రోజులలో ప్రత్యేకించి చదువుతారు. ఈ స్కంద షష్ఠి అక్టోబర్ నవంబర్ నెలలో వస్తుంది.
ఈ కవచమును శ్రద్ధతో ప్రతీ రోజూ పఠించిన భక్తులకు సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహము లభిస్తుంది, ఆ షణ్ముఖుని శక్తి ఆయుధము మనకు ఒక కవచమై ఎల్లప్పుడూ రక్షిస్తుంది, అంతేకాక సర్వ వ్యాధి నివారణ, ఐశ్వర్య ప్రాప్తి, చేసే పనులలో విజయం కలగడం, సర్వ గ్రహ, శత్రు, కలి బాధలు హరిమ్పబడతాయి, ఎటువంటి భూత ప్రేతములు దరి చేరలేవు, ఇహములో ఎన్నో సౌఖ్యములను కలుగజేసి, చివరకు స్కంద సాయుజ్యమును కలుగ చేయగల స్తోత్రం ఈ స్కంద షష్ఠి కవచం. ఈ కవచం పఠించిన వాళ్లకి అన్నిటా విజయం లభిస్తుంది.
ప్రత్యేకించి తమిళనాట ఎంతో మంది మహా భక్తులు ఈ కవచం యొక్క అద్భుత ఫలితములను అనుభవించారు. జీవితములో తీరని సమస్యలు, కోరికలు (ధర్మబద్ధమైనవి) నెరవేరుతాయి, సంతానము లేని వారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది, దీనిని నమ్మి పఠించిన వారి ఇల్లు సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది. మనం ఈ జన్మలోనూ, పూర్వ జన్మలలోనూ తెలిసీ, తెలియక అనేక పాపములు చేసి ఉంటే, వాటి ఫలితములను ఘోర రూపములో అనుభవించవలసి ఉంటే, ఈ స్కంద షష్ఠి కవచం పఠించడం వల్ల, షణ్ముఖ కటాక్షం కలిగి, మనకు కవచమై, మనల్ని రక్షించగలదు.
స్కంద షష్ఠి కవచం తిరుచెందూర్ లో కొలువై ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారిని ఉద్దేశించి వ్రాశారు శ్రీ దేవరాయ స్వామివారు. తమిళనాడులో బాగా ప్రసిద్ధి చెందిన ఆరు పడై వీడు (ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు) లో ఈ తిరుచెందూర్ ఒక దివ్య క్షేత్రము. ఈ తిరుచెందూర్ క్షేత్రం తిరునల్వేలి జిల్లాలో, సముద్ర తీరములో ఉన్న ఒక అద్భుతమైన ఆలయం. ఈ ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రముల యొక్క వివరములను రాబోయే టపాలో చర్చిస్తాను.
రచయిత గురించి:
శ్రీ దేవరాయ స్వామి వారి స్వగ్రామం తమిళనాడు లోని వళ్ళూరు. వీరి తండ్రి గారి పేరు శ్రీ వీరాస్వామి పిళ్ళై. వీరు వళ్ళూరులోనే అక్కౌంటెంట్'గా పనిచేసేవారు. వారికి చాలా కాలం సంతానం లేదు, చాలా కాలం తరువాత వారికి ఒక మగ బిడ్డ జన్మించాడు, ఈతనికి “దేవరాయన్” అనే పేరు పెట్టారు. ఈయనకి చిన్ననాటి నుండి తమిళ భాష మీద చాలా మక్కువ ఉండేది. ప్రాధమిక విద్యాభ్యాసం తర్వాత ఉన్నత కళలు అభ్యసించడానికి వీరు ఇరవైయేళ్ళ వయసులో బెంగళూరు పట్టణం చేరుకున్నారు. అదే సమయంలో త్రిశిరాపురం మహా విద్వాన్ శ్రీమీనాక్షిసుందరంపిళ్ళై అనే పండితుడు బెంగళూరు వచ్చారు. అప్పట్లో ఎంతో మంది విద్యార్థులు, పండితులు సైతం తమిళ భాషను అభ్యసించడానికి వీరి వద్దకు వచ్చేవారు. శ్రీ దేవరాయ స్వామి వారు శ్రీ పిళ్ళై వారిని కలిసి తమిళ భాష నేర్చుకోవాలని ఉందని, తనకి నేర్పమని అభ్యర్ధించారు. వీరికి విద్య నేర్పడానికి శ్రీ పిళ్ళై విద్వాన్ అంగీకరించారు. శ్రీ పిళ్ళై తమిళ భాషా సాహిత్యములో ఎన్నో ప్రయోగాలు చేసేవారు. ఇదే బాణీలో దేవరాయ స్వామి వారికి కూడా, పద్యాలు వ్రాయడం మీద మక్కువ పెరగడంతో, శ్రీ పిళ్ళై గారు వీరికి పద్యములు వ్రాయడానికి అవసరమైన వ్యాకరణము (దీనిని తమిళంలో యాపరుంగలక్ కారికై అని అంటారు) కూడా నేర్పించారు. ఈ విధంగా శ్రీ దేవరాయ స్వామి వారు చాలా కొద్ది కాలంలోనే తమిళ భాషా సాహిత్యం మీద పాండిత్యం సంపాదించారు.
ఒక సారి దేవరాయన్ వారికి విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది. ఆయన ఎంత మంది వైద్యులను సంప్రదించినా నయం కాలేదు. ఇంక మామూలు వైద్యములకు తగ్గదని నిశ్చయించుకుని, కేవలం భగవంతుడి కృప వలన తగ్గాలి అని, సెంథిల్ మురుగన్ మందిరమునకు వెళ్లారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహము లభించి ఆయన యొక్క కడుపు నొప్పి తగ్గిపోయింది. ఇక్కడ విశేషము ఏమిటంటే ఆ రోజు స్కంద షష్ఠి ఉత్సవములలో మొదటి రోజు కావడం. కార్తికేయుని యొక్క నిర్హేతుక కృపా కటాక్షములను పొందిన దేవరాయ స్వామి కన్నీటితో ఆనంద పారవశ్యంలో ఆరు కవచములను పాడారు. స్కంద షష్ఠి ఉత్సవాలు జరిగిన ఆరు రోజులలో ఒకో రోజు ఒక కవచం పాడారు. ఈ కవచములను స్తోత్రం చేసిననాటి నుండి వారు స్వామి అనే దీక్షా నామం తీసుకుని శ్రీ దేవరాయ స్వామిగా పిలవబడ్డారు.
ఈ కవచములలో సకల భువన భాండములకు నాయకుడు, పరబ్రహ్మ స్వరూపమైన శివ గౌరీ సుత సుబ్రహ్మణ్య వైభవం కీర్తించ బడింది.
సర్వం శ్రీ వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్యార్పణ మస్తు.
చాలా చక్కగా వివరించారు
రిప్లయితొలగించండిశుభాకాంక్షలు
chaala bagundi. subrahmanyaswami gurinchina marenni stotraalu, poojala gurinchina vivaraalanu, prasidda subrahmanya kshetraala vivaraalu andhincagalaru..
రిప్లయితొలగించండి