ఓం స్కందాయ నమః |
శ్రీ గురుభ్యో నమః
నమస్కారము,
ఆషాఢ శుక్ల పంచమిని “నాగపంచమి” గానూ, ఈరోజు సోమవారం అనగా ఆషాఢ శుక్ల షష్ఠిని “కుమార షష్ఠి” గానూ జరుపుకోవడం మన తెలుగునాట సాంప్రదాయం. ఈ
సందర్భంగా, శివశక్తుల అనురాగమునకు ఫలము, జ్ఞాన పండిత అని కీర్తించబడ్డ వాడు,
గజముఖానుజుడు, దేవసేనాపతి, వల్లీనాయకుడు అయిన శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి
వైభవమును తలచుకుని స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులమౌదాము. ఇక్కడ వ్రాయబడిన కుమారస్వామి వైభవం, తత్వ విశేషాలు,
గురువుల నుండి విన్నవి, సుబ్రహ్మణ్య ఉపాసనా గ్రంధము నుండి గ్రహించినవి, స్వామి
వారు ఇచ్చిన బుధ్ధి ప్రచోదనం మేరకు వ్రాయబడినది. ఇందు దోషములు ఏమైనా ఉంటే పెద్దలు తెలియజేయగలరు.
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి / కుమార స్వామి వారి వైభవం:
షణ్మతాలలో కుమారోపాసన (సుబ్రహ్మణ్యోపాసన)
ఒకటి. మిగిలినవి సౌర, శాక్త, వైష్ణవ, గాణాపత్య, శైవములు. అయితే అగ్ని గర్భుడు అని
పేరు ఉన్న సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే జరుగుతుందని శాస్త్ర వాక్యము.
అందుచేతనే పంచాయతన పూజలో ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తి ఉండదు.
అయితే దీపారాధన శివశాక్త్యాత్మకుడైన అగ్నిసంభవుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించడమేనని
పెద్దలు చెప్తారు. ఈ విధంగా వైదిక ధర్మం లో సుబ్రహ్మణ్యోపాసన చెప్పబడింది.
మనకి వైదిక వాఙ్మయంలో కుమార అనే నామం వినగానే
గుర్తుకు వచ్చేది కేవలం బుజ్జి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్య
గణపతులు పరబ్రహ్మ స్వరూపులేకాక, “కుమార”తత్వానికి ప్రతీక. జగత్తులో మాతాపితృ
తత్వానికి ప్రతీక పార్వతీ పరమేశ్వరులు. (లేదా లక్ష్మీ నారాయణులు... ఎలా పిలిచినా
ఒకటే). అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం ఈ నాలుగు పంచభూతాత్మక జగత్తుకి ఆధారం.
ఇందులో అమ్మవారు-అవ్యక్తం, అయ్యవారు-వ్యక్త స్వరూపాలకు సంకేతం అయితే, గణపతి-మహత్తత్వం,
కుమారస్వామి-అహంకారం. అహంకార తత్త్వం ఉండడం వల్లనే ఈ సకల జగత్తు సృష్టింపబడినది
అని చెప్తారు పెద్దలు. నిజానికి ఒకే పరతత్వం యొక్క నాలుగు భూమికలివి.
ఇక్కడ అహంకారం అంటే లోకంలో అనుకునే గర్వం అనే
భావం కాదు. నేను అనే స్పృహను అహంకారం అంటారు. ఈశ్వరుని పరంగా ఈ భావం ఉంటుంది.
ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభం అవుతుంది. చైతన్యం యొక్క లక్షణం అహంకారం. ఈ
సృష్టిలో కృత్రిమంగా, యాంత్రికంగా, వైజ్ఞానిక సాంకేతికంగా మానవుని మెదడు వంటి
జ్ఞాపక శక్తి కల యంత్రాన్ని తయారు చేయవచ్చునేమో కానీ, దానికి “నేను చేస్తున్నాను” అనే అహంభావం, స్పందన ఇవ్వలేము. అది కేవలం స్వాభావికమైన
సృష్టి లక్షణం. అనుభూతులకీ, ఆలోచనలకీ, స్పందనలకీ కేంద్రం ఈ అహం తత్వమే.
ఈ 'అహం'తత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు.
రహస్యంగా అందరిలోనూ ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది కనుక ‘గుహ’ అన్నారు స్వామిని. శివతేజస్సు నుండి ఉద్భవించిన
వాడు కనుక జ్ఞానతత్త్వం కలిగి ‘గురుగుహ’ అని స్వామికి నామం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడినది.
పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I
అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా II
తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I
పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు. అవ్యక్త
శక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి. వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి
అని స్కాంద పురాణం చెబుతోంది.
అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్నీ,
లక్ష్మీనారాయణులనీ కలిపి అర్చించినట్లే. ప్రకృతీ పురుషుల ఏకత్వం కుమార స్వామి
తత్త్వం.
కుమార జననంలోనే అనేక తాత్త్విక మర్మాలు
ఉన్నాయి. పరతత్వం-అవ్యక్తం నుండి జగద్రూపం తీసుకొనే పరిమాణ క్రమం కుమార జననంలో
కనబడుతుంది. అమోఘమైన శివతేజాన్ని పృథ్వి, అగ్ని, జలం (గంగ), నక్షత్ర శక్తి (షట్
కృత్తికలు) ధరించి చివరకు బ్రహ్మతపోనిర్మితమైన శరవణం (రెల్లు తుప్ప) లోంచి
ఉద్భవించినవాడు కనుక శరవణభవుడు అయ్యాడు అయ్యాడు.
కాలస్వరూపం: వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగా
స్వామిని వర్ణించారు. కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈ
సంవత్సరాగ్ని. ఆరు ముఖాలు - ఆరు ఋతువులు. పన్నెండు చేతులు - పన్నెండు మాసాలు. ఇదీ
సంవత్సరాగ్ని రూపం. ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది. వివిధ వర్ణాలను
వెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి.
జ్ఞానస్వరూపుడుః సుబ్రహ్మణ్యస్వామి వారు
రాసిభూతమైన జ్ఞానస్వరూపం. సునిసితమైన మేధస్సుకు స్వామి వారి చేతిలో ఉండే శక్తి
ఆయుధమే ప్రతీక. శివజ్ఞానప్రదాయిని అయిన అమ్మవారు ప్రసాదించిన దివ్యాయుధమిది. ఇదే
అజ్ఞానమనే తారకాసురుని సంహరించిన జ్ఞానశక్త్యాయుధము. “జ్ఞానశక్త్యాత్మా” అనేది
స్వామి వారి నామాలలో ఒకటి. ఇఛ్చా, జ్ఞాన, క్రియా అనేమూడు శక్తుల మయమైన శక్తిని
ధరించిన జ్ఞానశక్తి స్వరూపుడు, జ్ఞానయోగంలో సాక్షాత్కరించే శివశక్త్యాత్మక తేజః
పుంజం – కుమారస్వామి. ఆరుకోణాల చక్రం -
బహుముఖీయమైన ప్రజ్ఞకు సంకేతం కనుక కవిత్వానికీ, ప్రతిభకీ, ఆధారశక్తిగా కూడా
కుమారస్వామి ఉపాసన చెప్పబడినది. “షణ్ముఖీ ప్రతిభ” ప్రసాదించే ఈ కార్తికేయుని
‘కవి’గా పేర్కొన్నాయి శాస్త్రాలు.
“పుట్టన్ బుట్ట శరంబునన్ మొలువ” అనే పద్యంలో
పోతన గారు…”కావ్య రచనా సామర్ధ్యానికి నేను వాల్మీకిని కాను (పుట్టన్ బుట్ట),
శరవణభవుణ్ణి కాను (శరంబునన్ మొలువ)” అంటూ ప్రార్ధించారు. ఈ మాటలో కూడా కవితా శక్తి
నిధిగా స్కందుడోచరిస్తున్నాడు. శివతేజం స్కన్నమై వచ్చి రూపుకట్టిన దైవం కనుక ఈయన
స్కందుడు. రామాయణంలో యాగరక్షణకు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో వెళుతుండగా,
మార్గమధ్యంలో స్కందోత్పత్తి (సుబ్రహ్మణ్య జనన ఆఖ్యానము) వివరిస్తారు మహర్షి.
కార్తికేయ భక్తులు ఇహలోకంలో ఆయుష్మంతులై
పుత్రపౌత్రులతో వర్ధిల్లి అంత్యమున స్కంద సాలోక్యాన్ని పొందుతారు. ఓ రామా! ఈ
కుమారసంభవం “ధన్యపుణ్యగాథ” అని విశ్వామిత్రుని మాట (వాల్మీకి రామాయణం – బాలకాండ).
ఏషతే రామ గంగాయా విస్తరోమయా I
కుమారసంభవశ్చైవధన్యం పుణ్యస్తథైవ చ II
భక్తశ్చయః కార్తికేయే కాకుత్ స్థ భువిమానవాః I
ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్ II
మహాభారతంలో కూడా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య
స్వామి వారి జనన గాథ, తారకాసుర సంహారం అద్భుతంగా వర్ణించారు వ్యాసమహర్షి.
ధర్మరాజుగారికి మార్కండేయ మహర్షి చెప్తారు సుబ్రహ్మణ్య జనన వైభవం గురించి. ఇక్కడ
మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అటు శ్రీరామాయణం లోనూ, ఇటు మహాభారతంలోనూ కూడా
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం గురించి ఇవ్వడంలో రహస్యం సాధకులగా మనం గురువుల
నుంచి తెలుసుకోవలసిన విషయం. రామాయణం లో రామచంద్రప్రభువుకి స్కందోత్పత్తి చెప్పడంలో
ఉద్దేశ్యం ఏమిటంటే, సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి రాముడిలో ప్రవేశించాలి. అది రావణ
సంహారమునకు అవసరము. సుబ్రహ్మణ్య స్వామి వారిని అందుకే ఆంగ్ల భక్తులు “The God of
War” అని సంబోధిస్తారు. దేవతలకు రాక్షసులకు, మంచికి చెడుకి, రాముడికి-రావణుడికి,
పాండవులకి-కౌరవులకి మధ్య జరిగే యుధ్ధములలో దేవతా సైన్యం విజయం సాధించాలంటే,
దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి అవసరము. ఇక్కడ ఇలా చెప్పడంలో
రాముడిని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు…అసలు విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి వారు
యజ్ఞ తత్వమునకు ప్రతీక, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞపురుషుడిగానూ, యజ్ఞతత్వమునకు ప్రతీక గానూ విష్ణు సహస్ర నామాలలో అభివర్ణించబడినది. అందులోనే
శ్రీమహావిష్ణువుకి “స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః” అనే నామాలు ఉన్నాయి,
అంటే స్కందుడు అన్నా, సుబ్రహ్మణ్యుడు అన్నా, మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అని
అర్ధం. మరి విష్ణువే రాముడు కదా, ఆయనకి
విశ్వామిత్ర మహర్షి సుబ్రహ్మణ్య తత్వం బోధించడంలో ఏమిటి రహస్యం అంటే రాముడు అవతార
ప్రయోజనం కోసం సాధారణ మానవుడిగా వచ్చాడు, అప్పుడు ఆయన రావణ సంహారం చేయడానికి
అవసరమైన సకల అస్త్ర శస్త్రములతో పాటుగా, యుధ్ధ వీరుడైన సుబ్రహ్మణ్యుని శక్తిని
కూడా రాముడిలో ప్రవేశ పెట్టడమే విశ్వామిత్రుల వారి ఆంతర్యము. ఇదే విషయం భారతంలో
ధర్మరాజు గారికి సుబ్రహ్మణ్య వైభవం, తారకాసుర సంహారం చెప్పబడడలోనూ వర్తిసుంది.
అయితే రామాయణం లోనూ, మహాభారతంలోనూ,
శివమహాపురాణంలోనూ, స్కాందపురాణంలోనూ చెప్పబడ్డ సుబ్రహ్మణ్య స్వామి జనన, లీలా
విశేషాలలో చిన్న చిన్న వ్యత్యాసాలు కనిపించవచ్చు. కానీ, అవి అన్నీ సత్యాలే. ఒకే కుమారసంభవమును
అనేక కోణాలలో మహర్షులు దర్శించారు.
కుమారస్వామి వారి పేరు చెబితే మనందరికీ
గుర్తుకు వచ్చే ఒక గొప్ప కావ్యం…..”కుమారసంభవం”. మహాకవి కాళిదాసు గారు రచించిన ఈ
కుమారసంభవం మొత్తం ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్యుడి ప్రసక్తి ఉండదు. కేవలం శివ
పార్వతుల కళ్యాణ ఘట్టం వరకు చెప్పి ముగిస్తారు కాళిదాసు. శివ పార్వతుల ఏకత్వమే
కుమారుని సంభవం.
అష్టాదశపురాణాలలో లక్ష శ్లోకాలు ఉన్న పురాణం
స్కాందపురాణం. ఈ పురాణం పరమశివుడి నుంచి స్కందుడు విన్నాడు, అందుకే స్కాంద పురాణం
అయ్యింది. తంత్ర శాస్త్రంలో కూడా వివిధ సుబ్రహ్మణ్య స్వరూపాలు చెప్పబడ్డాయి.
ఉత్థిత కుండలినీ శక్తికి ప్రతీకగా
సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామి వారి ఇద్దరు భార్యలు
అంటే ఇక్కడ లౌకికమైన భార్యలు అని కాదు. వల్లీ అమ్మ వారు కుండలినీ శక్తికి ప్రతీక.
ఆ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాకే నాదశక్తికి ప్రతీక వల్లీ అమ్మ. మనందరిలోనూ
కుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకుని మూలాధార చక్రము నందు ఉంటుంది.
అయితే ఆ కుందలినీశక్తిని కదపడం అనేది కేవలం సమర్ధుడైన గురువు పర్యవేక్షణలో తప్ప
ఎవరూ సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెప్తారు.
ఇక దేవసేనా అమ్మ వారు అంటే, ఇంద్రియశక్తులే
దేవసేన. కాదు కాదు సకల సృష్టిలో ఉన్న positive energy కి ప్రతీక. వల్లీ, దేవసేనా
అమ్మలు ఇద్దరూ చైతన్య స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడికి పత్నులు.
“నీవంటి దైవము షడానన! నేనెందుకు కాననురా!
మారకోటులందు గల శృంగారము, ఇందుముఖా! నీ కొనగోటను బోలునే!” అని స్కందుని
కీర్తించారు నాదబ్రహ్మ త్యాగరాజ స్వామి. అలాగే శ్రీముత్తుస్వామి దీక్షితార్ గారు
సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం పొంది, స్వామి అనుగ్రహం పొందిన
మహనీయుడు. ప్రఖ్యాత ఆరుపడైవీడు క్షేత్రములలో ఒకటైన ‘తిరుత్తణి’ లో కుమారస్వామి ఒక
వృధ్ధ గురురూపంలో కనిపించి “ముత్తుస్వామి దీక్షితార్! ఏదీ నీ నోరు తెరూ…అని చెప్పి
ఆయన నోటిలో పటికి బెల్లం వేసి” వెళ్ళిపోయారు. దీక్షితార్ కళ్ళు తెరిచి చూసేసరికి
అక్కడ స్వామి లేరు. అప్పటి నుంచే దీక్షితార్ గారు ఆసువుగా సంగీత, సాహిత్య,
మంత్రశాస్త్ర, నాదరహస్యాలు కలబోసిన అనేక దివ్యమైన కృతుల్ని చేశారు. ప్రతీ కీర్తనలో
‘గురుగుహ’ అనే నామముతో ముద్రాంకితం చేశారు. “శ్రీగురుగుహ తారయాశు మాం శరవణభవ!
శ్రీగురుగుహ తారయాశు మాం శరవణభవ!”, “స్వామినాథ! పరిపాలయాశు మాం స్వప్రకాశ! వల్లీశ!
గురుగుహ! దేవసేనేశ!” ఇలా ఎన్నెన్నో కీర్తనలను స్వామివారిపై కీర్తించారు.
అలాగే తమిళనాట విశేష సుబ్రహ్మణ్యారాధన
చేస్తారు. అరుణగిరినాథర్ అనే గొప్ప భక్తుడు సుబ్రహ్మణ్యానుగ్రహముతో తిరుప్పుగళ్
అనే పేరుతో కొన్ని వేల కీర్తనలు చేశారు.
చివరిగా నడిచేదేవుడు, కంచికామకోటి పీఠాధిపతి
పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి మాటలలో చెప్తే, ఉపాసనలో
పరమశివుడికి కొన్ని ఇష్టం, అలాగే అమ్మ వారికి కొన్ని ఇష్టం, భక్తులు అమ్మకి అయ్యకి
ఇద్దరికీ కలిపి పూజ చేయాలి అంటే కేవలం సుబ్రహ్మణ్యస్వామి వారికి పూజ చేస్తే చాలుట.
ఒకేసారి శివపార్వతులను పూజించినట్లే. అదీ కుమార తత్వం. ఇక్కడే కుమార తత్వం గురించి
మరో చక్కని మాట విన్నాను. పరమశివుడు ఎప్పుడూ తనలోతానే రమిస్తూ ఉంటాడు కదా, ఆయనకి
అవతారాలు ఎత్తడం అవీ ఉండవు. మనకి బాలకృష్ణుడు ఉన్నాడు, అలాగే బాలరాముడు ఉన్నాడు,
మరి బాలశంకరుడిని ఎక్కడ చూడగలం? అంటే పరమశివుడు చిన్నపిల్లవాడైతే….అదే మన బుజ్జి
సుబ్రహ్మణ్య స్వామి. అటువంటి ముద్దులొలికే నా చిట్టి తండ్రి, మూర్తీభవించిన అందం,
తేజస్సు, చిరునవ్వు, అచ్చం అమ్మ పోలికలో ఉండే కారుణ్యమూర్తి, నను గన్న తండ్రి,
భక్తుల వరాలను ఇట్టే తీర్చే కామధేనువు, సంతానము లేనివారికి సత్సంతాన భాగ్యం
ప్రసాదించే అభయప్రదాత, ఇహమునందు సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి, అంత్యమున తనలో
కలుపుకునే స్వామి…..అటువంటి మన కుమారస్వామి అనుగ్రహ కటాక్షములు భక్తులు ఎల్లరకు
కలగాలనీ, సుబ్రహ్మణ్యస్వామి వారు త్వరగా అవతరించాలనీ, ఈ జగత్తులోనూ మరియు మనలోనూ ఉన్న
ఆసురీ, అవైదిక, అధార్మిక శక్తులను సంహరించి, ధర్మస్థాపనం చేయాలనీ స్వామి వారి
పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను.
సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు