11, ఫిబ్రవరి 2016, గురువారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 14


శ్రీ గురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 70వ శ్లోకము II
పూర్వోక్తసంఖ్యయోజనదూరే పూషాంశుపాటలస్తస్య I
విద్రావయతు మదార్తిం విద్రుమసాలో విశంకటద్వారః II ౭౦

తాః తస్య - దానికి (మరకతప్రాకారమునకు), పూర్వోక్తరసంఖ్యయోజనదూరే - ముందు చెప్పబడిన యోజనముల దూరమునందు (ఏడు యోజనముల దూరమున ఉండు), పూషా - సూర్యుని, అంశు - కిరణములవలె, పాటలః - ఎఱ్ఱని కాంతి కలదియు, విశంకట - విశాలమైన, ద్వారః - వాకిళ్ళు గలదియు, విద్రుమసాలః - పగడములతో చేయబడిన ప్రాకారము, మదార్తిం - నా యొక్క పీడను/బాధలను,సంకటములను, విద్రావయతు - పోగొట్టుగాక !!
మరకతమయ ప్రాకారమునకు ఏడు యోజనముల దూరమునందు సూర్యుని కిరణాలవలె ఎఱ్ఱని కాంతి కలది, విశాలమైన వాకిళ్ళు కలది, పగడములతో చేయబడినది అయిన పదిహేడవ ప్రాకారము (పగడమయ) - నా యొక్క బాధను/పీడను/సంకటములను పోగొట్టుగాక !!

II ఆర్యా ద్విశతి -  71వ శ్లోకము II
ఆవరణయోరహర్నిశ రంతరభూమౌ ప్రకాశశాలిన్యామ్ I
ఆసీనమంబుజాసన మభినవసింధూరగౌరమహమీడే II ౭౧

తాః ఆవరణయోః - మరకత, విద్రుమ ప్రాకారముల యొక్క, ప్రకాశశాలిన్యాం - ప్రకాశములతో ఉన్న, అంతరభూమౌ - మధ్యప్రదేశమునందు, ఆసీనం - కూర్చుని ఉన్నట్టి, అభినవసింధూరగౌరం - క్రొత్త సింధూరమువలె ఎర్రని శరీరకాంతి కలవాడగు, అంబుజాసనం - బ్రహ్మగారిని, అహం - నేను, ఈడె - స్తుతించుచున్నాను !!
పదహారవ (మరకతమయ) మరియు పదిహేడవ (విద్రుమ) ప్రాకారముల యొక్క మధ్యప్రదేశమునందు, బాగా ప్రకాశించుచున్న ప్రదేశమున, క్రొత్త సింధూరమువలె ఎర్రని శరీరకాంతి కలిగిన బ్రహ్మగారిని నేను స్తుతించుచున్నాను !!

II ఆర్యా ద్విశతి - 72వ శ్లోకము II
వరణస్య తస్య మారుతయోజనతో విపులగోపురద్వారః I
సాలో నానారత్నైస్సంఘటితాంగః కృషీష్ట మదభీష్టమ్ II ౭౨

తాః తస్యవరణస్య - ఆ పగడపు (విద్రుమ) ప్రాకారమునకు, మారుతయోజనతః - ఏడు యోజనముల దూరమునందు ఉండు, విపులగోపురద్వారః - విశాలమైన గోపురములు, ద్వారములు కలదియు, నానారత్నైః - పలువిధములైన మణులచేత, సంఘటితాంగః - చేయబడినది అగు, సాలః - ప్రాకారము, మదభీష్టం - నా అభీష్టములను, కృషీష్ట - నెరవేర్చుగాక !!

పగడపు ప్రాకారమునకు ఏడు యోజనముల దూరమునందు, విశాలమైన గోపురములు, ద్వారములు కలిగి, నానారత్నములచేత అలంకరింపబడిన 18వ ప్రాకారము (నానారత్న ప్రాకారము) - నా అభీష్టములను నెరవేర్చుగాక !!

II ఆర్యా ద్విశతి - 73వ శ్లోకము II
అంతరకక్ష్యా మనయోరవిరళశోభాపిచండిలోద్దేశామ్ I
మాణిక్యమంటపాఖ్యాం మహతీమధిహృదయ మనిశమాకలయే II ౭౩

తాః అనయోః - ఆ రెండు (పగడము, నానారత్న) ప్రాకారముల, అంతరకక్ష్యాం -  మధ్య భూమియందు ఉండు, అవిరళ - దట్టమైన, శోభా - కాంతులచేత, పిచండిలా - పూరింపబడిన (కాంతులతో నిండిన), ఉద్దేశాం - ప్రదేశము కలదియు, మహతీం - గొప్పదైన, మాణిక్యమంటపాఖ్యాం - మాణిక్యమండపమును, అధిహృదయం - మనస్సునందు, అనిశం - ఎల్లప్పుడూ, ఆకలయే - ధ్యానించుచున్నాను !!

పగడము, నానారత్న ప్రాకారముల మధ్య ప్రదేశమునందు, దట్టమైన కాంతులచేత నిండిన మాణిక్యమండపమును నా మనస్సునందు ఎల్లప్పుడూ ధ్యానించుచున్నాను !!

II ఆర్యా ద్విశతి - 74వ శ్లోకము II (ఈ 74వ శ్లోకము నుండి 78వ శ్లోకము వరకు శ్రీమహావిష్ణువుని ధ్యానించే శ్లోకములు)
తత్ర స్థితం ప్రసన్నం తరుణతమాలప్రవాళకిరణాభామ్ I
కర్ణావలంబికుండల కందళితాభీశుకవచితకపోలమ్ II ౭౪

తాః తత్ర - ఆ మణిక్యమంటపము నందు, స్థితం - ఉన్నట్టివాడును, ప్రసన్నం - ప్రసన్నముగా ఉండెడి వాడును (అనుగ్రహించెడి వాడు), తరుణ - కోమలమైన, తమాల - కానుగచెట్ల, ప్రవాళ - చిగుళ్లయొక్క, కిరణ - కాంతుల వంటి, ఆభం - శరీర కాంతి కలవాడు, కర్ణావలంబి -చెవులయందు ధరింపబడిన, కుండల - కుండలముల నుండి, కందళిత - బయలువెడలుచున్న, అభీశు - కిరణములచేత (కాంతులచేత), కవచిత - వ్యాపింపబడిన, కపోలమ్ - చెక్కిళ్ళు కలవాడును...

ఆ మాణీక్యమంటపము నందు, ప్రసన్నముగా ఉండెడి వాడు, లేత కానుగ చుగుళ్ళ కాంతులవంటి శరీరఛాయ కలవాడును, చెవులలో ధరించిన కుండలముల నుండి వెలువడు కాంతులచేత ప్రకాశింపబడిన చెక్కిళ్ళు కలవాడును ....

II ఆర్యా ద్విశతి - 75వ శ్లోకము II
శోణాధరం శుచిస్మితమేణాంకనిభాస్య మేధమానకృపమ్ I
ముగ్ధైణమదవిశేషక ముద్రితనిటలేందురేఖికారుచిరమ్ II ౭౫

తాః శోణాధరం - ఎఱ్ఱని పెదవి కలవాడూ, శుచిస్మితం - తెల్లని శుద్ధమైన చిరునవ్వు కలవాడూ, ఏణాంక - చంద్రునితో, నిభ - సమానమైన, ఆస్యం - ముఖము కలవాడూ, ఏధమాన - పైపై వృద్ధి చెందుతున్న, కృపం - దయారసము కలవాడూ, ముగ్ధ - సుందరమైన, ఏణమద - కస్తూరితో దిద్దబడిన, విశేషక - బొట్టుచేత, ముద్రిత - అలంకరింపబడిన, నిటలేందురేఖికా - చంద్రరేఖవంటి ఫాలము చేత, రుచిరం - మనోహరుడైనట్టి వాడూ...
ఎర్రని పెదవులు కలవాడూ, శుద్ధమైన చిరునవ్వు కలవాడూ, చంద్రునితో సమానమైన ముఖము కలవాడూ, అత్యంత దయ కలిగిన వాడూ, సుందరమైన కస్తూరితో దిద్దబడిన బొట్టుచేత అలంకరింపబడిన, చంద్రరేఖ వంటి ఫాలము కలవాడూ, మనోహరుడైన వాడూ ...

II ఆర్యా ద్విశతి - 76వ శ్లోకము II
నాళీకదళసహోదర నయనాంచలనటితమనసిజాకూతమ్ I
కమలాకఠినపయోధర కస్తూరీఘసృణపంకిలోరస్కమ్ II ౭౬

తాః నాళీకదళ - తామరరేకులకు, సహోదర - సమానమైన, నయన - నేత్రముల, అంచల - కొనలయందు, నటిత - కదలుచున్న (ప్రకాశించుచున్న), మనసిజ - మన్మథుని యొక్క, ఆకూతమ్ - భావము కలవాడూ, కమలా - లక్ష్మీదేవి యొక్క, కఠినపయోధర - ధృఢమైన స్తనములయందలి, కస్తూరీ - కస్తూరి చేతను, ఘసృణ - కుంకుమపూవుచేతను, పంకిల - పూయబడిన, ఉరస్కం - ఱొమ్ము కలవాడూ ...
తామరరేకులతో సమానమైన నేత్రముల యందు ప్రకాశించుచున్న మన్మథుని భావము కలవాడూ, లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ధృఢమైన స్తనములయందలి కస్తూరి చేతనూ, కుంకుమపూవుచేతనూ పూయబడిన ఱొమ్ము వాడూ (అనగా, లక్ష్మీ సమేతుడైన వాడూ..)

II ఆర్యా ద్విశతి - 77వ శ్లోకము II
చాంపేయగంధికైశ్యం శంపాసబ్రహ్మచారికౌశేయమ్ I
శ్రీవత్సకౌస్తుభధరం శ్రితజనరక్షాధురీణచరణాబ్జమ్ II ౭౭

తాః చాంపేయ - సంపంగి పూవుల, గంధి - వాసన కల, కైశ్యం - కేశసమూహము కలవాడూ, శంపా - మెఱుపు తీగతో, సబ్రహ్మచారి - సమానమైన, కౌశేయం - పట్టువస్త్రములను ధరించినవాడూ, శ్రీవత్సకౌస్తుభధరం - శ్రీవత్సమనెడు చిహ్నమును, కౌస్తభమను మణిని ధరించినవాడూ, శ్రితజన - తనను ఆశ్రయించిన వారిని (భక్తులను), రక్షా - కాపాడుటయందు, ధురీణ- భారమును వహించిన, చరణాబ్జం - పాదకమలములు కలవాడూ ...
సంపంగి పూవుల వాసన కల కేశసమూహము కలవాడునూ, మెఱుపుతీగవంటి పట్టువస్త్రములను ధరించినవాడునూ, శ్రీవత్సమనెడు చిహ్నమును, కౌస్తుభ మణిని ధరించినవాడునూ, తనను ఆశ్రయించిన భక్తులను రక్షించుటయందు భారమును వహించిన పాదకమలములు కలవాడునూ...

II ఆర్యా ద్విశతి - 78వ శ్లోకము II
కంబుసుదర్శన విలసత్కరపద్మం కంఠలోలవనమాలమ్ I
ముచుకుందమోక్షఫలదం ముకుందమానందకంద మవలంబే II ౭౮ 


తాః కంబు - శంఖము, సుదర్శన - చక్రము లతో, విలసత్ - ప్రకాశించుచున్న, కరపద్మం - కరకమలములు కలవాడూ, కంఠ - మెడయందు, లోల - వ్రేలాడుచున్న, వనమాలం - పూలదండ కలవాడూ (తోమాల), ముచుకుంద మోక్షఫలదమ్ - ముచుకుందుడు అనెడి భక్తుడికి మోక్షరూపమైన ఫలమును ఇచ్చినవాడూ, ఆనందకందం - ఆనందమునకు మూలకారణమైనవాడూ (బ్రహ్మానంద స్వరూపుడు అగు), ముకుందం - శ్రీమహావిష్ణువును, అవలంబే - ఆశ్రయించుచున్నాను !!

(సశేషం .... )

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

3, ఫిబ్రవరి 2016, బుధవారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 13



శ్రీ గురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 61వ శ్లోకము II
పవమానసంఖ్యయోజనదూరే బాలతృణమేచక స్తస్య I
సాలో మరకతరచితస్సంపదమచలాం శ్రియం చ పుష్టాతు II ౬౧

తాః తస్య - దానికి (ముక్తామణి ప్రాకారమునకు), పవమాన సంఖ్యయోజనదూరే - ఏడు యోజనముల దూరము నందు, (పవమాన సంఖ్య - వాయువుల సంఖ్య అనగా ఏడు), బాలతృణమేచకః - లేతపచ్చికగడ్డి వలె కాంతిగల, మరకతరచితః - మరకత మణులతో నిర్మింపబడిన సాలః - ప్రాకారము, సంపదం - సంపదలను/ధనములను, అచలాం - స్థిరమైన, శ్రియం చ - లక్ష్మిని (సౌభాగ్యమును), పుష్టాతు - వృద్ధి పొందించుగాక !!

పదిహేనవ (ముక్తామణి) ప్రాకారమునకు ఏడు యోజనముల దూరములో లేతపచ్చికగడ్డి వలె కాంతిగల మరకత మణులతో చేయబడిన ప్రాకారము - పదహారవది అయిన మరకతమయ ప్రాకారము - మాకు స్థిరమైన సంపదలను, సౌభాగ్యమును వృద్ధి పొందించుగాక !!

II ఆర్యా ద్విశతి - 62వ శ్లోకము II
ఆవృత్తియుగ్మాంతరతో హరితమణీనివహమేచకే దేశే I
హాటకతాళీవిపినం హాలాఘటఘటిత విటపమాకలయే II ౬౨

తాః ఆవృత్తియుగ్మాం - ఆ రెండు (ముక్తామణి మరియు మరకతమయ) ప్రాకారముల, అంతరతః - మధ్య ప్రదేశమునందు, హరితమణీ - మరకత మణుల, నివహ - గుంపులవలె, మేచకే - నల్లని, దేశే - ప్రదేశమునందు ఉండు, హాలాఘట - కల్లుకుండలతో, ఘటిత - కూర్పబడిన, విటపం - కొమ్మలుగల, హాటకతాళీవిపినం - బంగారు తాటిమ్రాకుల వనమును, కలయే -  ధ్యానించుచున్నాను !!
ముక్తామణి మరియు మరకతమయ ప్రాకారముల మధ్యప్రదేశమునందు, మరకత మణుల గుంపులవలె నల్లని ప్రదేశమునందు కల్లుకుండలతో కూర్పబడిన కొమ్మలు గల, బంగారు తాటివృక్షముల వనమును ధ్యానించుచున్నాను !!

II ఆర్యా ద్విశతి - 63వ శ్లోకము II
తత్రైవ మంత్రిణీగృహపరిణాహం తరళకేతనం సదనమ్ I
మరకతసౌధమనోజ్ఞం దద్యాదాయూంషి దండనాథాయాః II ౬౩

తాః తత్రైవ - ఆ ప్రదేశమునందే ఉండు, మంత్రిణీగృహపరిణాహం - శ్యామలాదేవి యొక్క సదనమంతటి వైశాల్యము కలదియు, తరళకేతనం - చలించుచున్న పతాకములు కలదియు, మరకతసౌధమనోజ్ఞం - మరకత నిర్మితమైన మేడలచేత రమ్యముగా నుండునదియు అగు, దండనాథాయాః - దండనాథాదేవి (ఈమెయే వారాహీ అమ్మవారు), సదనం - గృహము, ఆయూంషి - దీర్ఘాయుస్సులను, దద్యాత్ - ఇచ్చుగాక !!

ముక్తామణి మరియు మరకతమయ ప్రాకారముల మధ్యప్రదేశము నందు, బంగారు తాటి వృక్షముల వనము ఉండు చోట, శ్యామలాదేవి యొక్క సదనమంతటి వైశాల్యము కలిగినది, మరకత మణులతో నిర్మింపబడిన మేడలచేత రమ్యముగా ఉండునది అయిన, దండనాథాదేవి (అనగా వారాహీ అమ్మవారి) గృహము, మాకు దీర్ఘాయుష్షును ఇచ్చుగాక !!

దండనాథాదేవికి ద్వాదశ నామములు కలవు - అవి వరుసగా...
శ్రీహయగ్రీవః II
శృణు ద్వాదశనామాని తస్యా దేవ్యా ఘటోద్భవః I
యేషామా కర్ణనామాత్రాత్ప్రసన్నా సా భవిష్యతి II

పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ I
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ తథా II

వార్తాళీ చ మహాసేనాప్యాజ్ఞా చక్రేశ్వరీ తథా I
అరిఘ్నీచేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే II

నామా ద్వాదశకాభిఖ్య వజ్రపంజరమధ్యగః I
సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః II (లలితోపాఖ్యానము, 23వ అధ్యాయము, 54-58 శ్లో.)

వారాహీ అమ్మవారు, లలితాంబిక యొక్క అహంకారము నుండి పుట్టినది.
అహంకారాత్సముత్పన్నా మేఘశ్యామల విగ్రహా I
మహావార్తాళికాదేవీ పోత్రివక్త్రసముజ్జ్వలా II (లలితోపాఖ్యానము, 22వ అధ్యాయము, 31వ శ్లోకము)

II ఆర్యా ద్విశతి - 64వ శ్లోకము II
సదనే తత్ర హరిన్మణిసంఘటితే మంటపే శతస్తంభే I
కార్తస్వరమయపీఠే కనకమయాంబురుహకర్ణికామధ్యే II ౬౪

తాః తత్ర సదనే - ఆ గృహము నందు (అనగా వారాహీ అమ్మవారి గృహము నందు), హరిన్మణిసంఘటితే - పచ్చని పరకత మణులచేత నిర్మింపబడినది, శతస్తంభే - నూరు స్తంభములు కలదియు, మంటపే - మంటపము నందు, కార్తస్వరమయపీఠే - బంగారముతో చేయబడిన పీఠము యందు, కనకమయ - బంగారుమయమైన, అంబురుహ - తామరపువ్వు యొక్క, కర్ణిక - దుద్దు యొక్క, మధ్యే - నడుమ ఉండు....

II ఆర్యా ద్విశతి -  65వ శ్లోకము II
బిందుత్రికోణవర్తుల షడస్రవృత్తద్వయాన్వితే చక్రే I
సంచారిణీ దశోత్తర శతార్ణ మనురాజకమలకలహంసీ II ౬౫ 

తాః బిందుత్రికోణ - బిందువు, త్రికోణము, వర్తుల - గుండ్రమగు, షడస్రవృత్తద్వయ - ఆరు రేకులు గల రెండు వలయములతో, అన్వితే - కూడిన, చక్రే - చక్రము నందు, సంచారిణీ - సంచరించుచున్న, దశోత్తర - పదికి పైగాగల, శతార్ణ - నూరు వర్ణములు గల (110 అక్షరములు గల), మనురాజ - మంత్రశ్రేష్టమనెడు, కమల - తామరము యందు విహరించు, కలహంసీ - రాజహంసాంగనయు...

బిందువు, త్రికోణము, గుండ్రమగు ఆరురేకుల రెండు వలయములతో కూడిన చక్రము నందు, సంచరించుచున్నదియు, సహస్రముకి పైగా అక్షరములు గల మంత్రశ్రేష్టమనెడు కమలము యందు విహరించుచున్న రాజహంసాంగనయు ....

II ఆర్యా ద్విశతి - 66వ శ్లోకము II
కోలవదనా కుశేశయనయనా కోకారిమండితకిరీటా I
సంతప్తకాంచనాభా సంధ్యారుణచేల సంవృతనితంబా II ౬౬ 

తాః కోలవదనా - వరాహముఖము కలదియు, కుశేశయనయనా - తామరల వంటి నయనములు గలదియు, కోకారి - చంద్రుని చేత, మండిత - అలంకరింపబడిన, కిరీటా - శిరోభూషణము గలదియు, సంతప్తకాంచనాభా - తప్తము చేయబడిన బంగారము వంటి శరీరము గలదియు, సంధ్యారుణ - సంధ్యాకాంతివలె ఎర్రని, చేల - వస్త్రముచేత, సంవృత - చుట్టబడిన, నితంబా - శరీరము కలదియు..

వరాహముఖము కలిగి, తామరముల వంటి నయనములు, శిరస్సున చంద్రవంకను ధరించిన, తప్తము చేయబడిన బంగారము వంటి శరీరము కలదియు, ఎర్రని వస్త్రములను ధరించినదియు...

II ఆర్యా ద్విశతి - 67వ శ్లోకము II
హల ముసల శంఖచక్రాంకుశ పాశా౨భయవరస్ఫురిత హస్తా I
కూలంకషానుకంపా కుంకుమజంబాలితస్తనాభోగా II ౬౭

తాః హల - మడక, ముసల - రోకలి, శంఖ - శంఖము, చక్రము, అంకుశము, పాశము, అభయముద్ర, వరముద్ర తో , స్ఫురిత - ప్రకాశించుచున్న, హస్తా - హస్తములు గలదియు, కూలంకష - పూర్ణమైన (గట్టును పెళ్లగించు), అనుకంపా - దయారసము గలదియు, కుంకుమ - కుంకుమచేత, జంబాలిత - పూయబడిన, స్తనాభోగా - కుచముల వైశాల్యము కలిగినదియు..

II ఆర్యా ద్విశతి - 68వ శ్లోకము II
ధూర్తానామతిదూరా వార్తాశేషావలగ్నకమనీయా I
ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ II ౬౮ 

తాః ధూర్తానాం - దుష్టులకు, అతిదూరా - మిక్కిలి దూరముగా ఉండునదియు (అనగా ధూర్తులకు లభించనది), వార్తాశేష - మాటయే శేషముగా గల (ఉన్నదో లేదో అనునంతటి సన్నని), వలగ్న - నడుము చేత, కమనీయా - మనోజ్ఞురాలైనదియు, ఆర్తాళీ - ఆర్తుల సమూహములకు (ఆర్తిగా ఉన్న భక్తులకు), శుభదాత్రీ - శ్రేయస్సును ఇచ్చునదియు అగు, వార్తాళీ - వారాహీ అమ్మవారు (దండనాథాదేవి), వాంఛితార్థాయ - అభీష్టములను, భవతు - ఇచ్చుగాక !!

దుష్టులకు అందనిది, సన్నని నడుము కలిగినది, ఆర్తులైన భక్తులకు శుభములను, శ్రేయస్సును ఇచ్చునది అయిన వారాహీ అమ్మవారు మాకు అభీష్టములను ప్రసాదించుగాక !!

II ఆర్యా ద్విశతి - 69వ శ్లోకము II
తస్యాః పరితో దేవీః స్వప్నేశ్యున్మత్తభైరవీముఖ్యాం I
ప్రణమత జృంభిన్యాద్యా భైరవవర్గాంశ్చ హేతుకప్రముఖాన్ II ౬౯

తాః తస్యాః పరితః - ఆ దేవిచుట్టూ ఉండు, స్వప్నేశీ - స్వప్నేశీదేవి, ఉన్మత్తభైరవీదేవి, ముఖాః - మొదలగు, దేవీః - దేవతలను, జృంభిన్యాద్యాః - జృంభినీ మొదలగు దేవతలను, హేతుక ప్రముఖాన్ - హేతుకుడు మొదలగు, భైరవవర్గాంశ్చ - భరవుడను దేవతను, ప్రణమత - నమస్కరించుచున్నాను.

వారాహీ అమ్మవారి చుట్టూ ఉండే స్వప్నేశీదేవి, ఉన్మత్తభైరవీదేవి, జృంభినీ, హేతుకుడు, భైరవుడు మొదలగు దేవతలకు నమస్కరించుచున్నాను !!

దండనాథాదేవి యొక్క చక్రమునకు కిరిచక్రరథమని పేరు. దానికి చక్ర రక్షకులు - డృంభిని, స్తంభిని, మోహిని అను ముగ్గురు శక్తులు. వీరు ఆ చక్రమునకు అధిష్టాన దేవతలు. ఆ రథమునకు క్రింది భాగమునందు, అష్టదిక్కులందును, అథోభాగమునందు రక్షకులై హేతుకుడు మొదలగు దశభైరవులు కలరు.. వారి పేర్లు..
హేతుక స్త్రిపురారిశ్చ తృతీయాశ్చాగ్నిభైరవః I
యమజిహ్వైకపాదౌచ తౌచకాలకరాళకౌ II

భీమరూపో హాటకేశస్తధైవాచలనామవాన్ I
ఏతే దశైవ విఖ్యాతా దశకోటిభటాన్వితాః II (లలితోపాఖ్యానము, 25వ అధ్యాయము, 81-82వ శ్లోకములు)

(సశేషం .... )

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.