15, సెప్టెంబర్ 2011, గురువారం

ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు – తిరుప్పరంకుండ్రం


వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు 

ఆరు పడై వీడు – తిరుప్పరంకుండ్రం

 

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం. ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది. ఈ క్షేత్రం తమిళనాడులో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయిన మధురై కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం. 
తిరుప్పరంకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి

ఇంకో విశేషము ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండ రాతిని చెక్కి మలచినది. ఆలయం లోకి ప్రవేశించగానే, అక్కడ నలభై ఎనిమిది స్తంభాలు, ఒక్కో స్థంభం మీదా ఒక్కో భగవన్మూర్తి ఉంటుంది. అక్కడే ఒక స్థంభం మీద దుర్గా అమ్మ వారు ఉంటారు. అక్కడ అందరూ వెన్న ముద్దలతో అమ్మ వారికి పూజ చేస్తారు. అది ఎందుకో మాకు కొంత భాష రాకపోవడం వల్ల తెలుసుకోలేక పోయాము. మరొక స్థంభం మీద విఘ్నేశ్వరుడు, పార్వతీ దేవిని శివునికి అప్పగిస్తున్న శ్రీ మహా విష్ణువుతో కూడిన శివ కళ్యాణ ఘట్టం ఉంటుంది. చాలా బాగుంటుంది.
ఇంకా లోపలి వెడితే, ముందుగా స్వామి వారి యొక్క వాహనం మయూరము, విఘ్నేశ్వర వాహనం మూషికము, శివుని వాహనము నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఇంకా పైకి మెట్ల మీదుగా వెడితే గర్భాలయం సమీపిస్తాము. ఇక్కడ గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు సింహాసనంలో కూర్చుని ఉంటారు, ఆయనకి ఎడమవైపు దేవయానీ అమ్మ, కుడి వైపు నారద మహా ముని క్రిందకి కూర్చుని ఉంటారు. ఇక్కడ స్వామికి అభిషేకం చేయరు, కేవలం ఆయన శక్తి శూలమునకు మాత్రమే అభిషేకం చేస్తారు. అంతేకాక, అక్కడే విఘ్నేశ్వర స్వామి వారు “కర్పగ వినాయగర్” అనే పేరుతో ఉంటారు. పెద్ద మూర్తి, చాలా బాగుంటారు. ప్రక్కనే మహాదేవుడు లింగ స్వరూపంలో ఉంటారు. దుర్గా అమ్మ వారు మధ్యలో ఉంటారు. దుర్గ అమ్మకి ఎడమవైపు వినాయకుడు, కుడి వైపు సుబ్రహ్మణ్యుడు ఉంటారు. శివలింగం ఎదురుగా పెరుమాళ్, అంటే శ్రీ మహా విష్ణువు కూడా ఉంటారు. ఈ స్వరూపాలన్నీ, ఆలయం లోపలకి వెళ్ళాక, మెట్ల దారిలో కొంచెం పైకి ఎక్కవలసి ఉంటుంది. పైకి ఎక్కిన తరువాత సుబ్రహ్మణ్యుడు, విఘ్నేశ్వరుడు, శివ లింగము, దుర్గా అమ్మ, పెరుమాళ్ అందరూ ఒకే చోట ఉంటారు. ముందు కొత్తగా వెళ్ళిన వాళ్లకి అసలు మూల స్వరూపం ఎలా ఉంటారో, ఎక్కడ ఉన్నారో వెంటనే అర్ధం కాదు. చాలా చక్కని అనుభూతి. తప్పక చూడవలసిన క్షేత్రం.

ఇక్కడ ఎప్పుడూ పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు, ఉత్సవ మూర్తుల స్వామి వారి అభిషేకం చూసే భాగ్యం కూడా దక్కింది.

ఈ క్షేత్రమునకు సంబంధించిన పురాణము ఈ విధముగా ఉంది.
మన బుజ్జి సుబ్రహ్మణ్యుడి భార్యలు అయిన శ్రీ వల్లి, దేవయానీ అమ్మలు ఇద్దరు శ్రీ మహా విష్ణువు యొక్క కుమార్తెలు. వీరి యొక్క పేర్లు అమృత వల్లి, సుందర వల్లి. (మహా విష్ణువుకి కుమార్తెలు ఏమిటి అని ఆశ్చర్య పోకూడదు. మన పురాణములలో చెప్పే ఆఖ్యానములకు అనేక స్థూల, సూక్ష్మ, కారణ కారణాలు ఉంటాయి. అవి మానవులకు ఉండే ప్రాకృతికమైన సంబంధాలుగా చూడకూడదు. వాటిలోని సూక్ష్మములు గురువుల ద్వారా తెలుసుకోవాలి.)
అయితే ఒక రోజు వల్లి, దేవయానీ అమ్మలు ఇద్దరూ సుబ్రహ్మణ్యుడి వద్దకు వచ్చి వారిని కళ్యాణం చేసుకోమని అడుగుతారు. అప్పుడు స్వామి అమృత వల్లి తో “నిన్ను ఇంద్రుడు తన కూతురిగా పెంచుతాడు. తరువాత కాలంలో నిన్ను వివాహం చేసుకుంటాను” అని అభయం ఇస్తారు. అలాగే సుందర వల్లిని కూడా అనుగ్రహిస్తారు స్వామి.

తరువాత అమృత వల్లి చిన్న ఆడ శిశువుగా మారి, మేరు పర్వతం దగ్గరకి వెళ్లి, ఇంద్రుడిని కలిసి “ నేను శ్రీ మహా విష్ణువు కుమార్తెను, నన్ను పెంచవలసిన బాధ్యత మీకు ఉంది“ అని చెప్తుంది. ఈ మాట విన్న ఇంద్రుడు ఎంతగానో సంతోషించి వెంటనే తన వద్దనున్న ఐరావతమును ఈ బిడ్డ ఆలనా పాలనా చూడవలెనని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఐరావతము అమృత వల్లి అమ్మను ఎంతో ప్రేమతో పెంచుతుంది ఆమెకు పెళ్లి చేసుకునే వయసు వచ్చే వరకు. అమృత వల్లి ని దేవతల ఏనుగు అయిన ఐరావతము పెంచడం వల్లనే, ఆమెకి దేవయాని అని పేరు వచ్చింది. (తమిళంలో “యానై” అంటే ఏనుగు).
అదే విధంగా సుందర వల్లి అమ్మ తరువాత కాలంలో శివముని అనే మునీశ్వరుని యొక్క తేజస్సు వలన అయోనిజగా పుడుతుంది. ఆమెను నంబి అనే భిల్ల నాయకుడు (గిరిజన నాయకుడు) పెంచుకుంటారు. తరువాత కాలంలో ఆమెను సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకుంటారు. అది వల్లీ కళ్యాణ ఘట్టం. వేరే అఖ్యానంలో వివరిస్తాను.

ఒకానొక సమయంలో పరాశర మహర్షి యొక్క ఆరుగురు కుమారులు శరవణ తటాకములో చేపలుగా ఉండమని శపింపబడతారు (దీని వెనుక వృత్తాంతం నాకు ఇంకా తెలియదు, తెలిస్తే తప్పక ఇక్కడ తెలియజేస్తాను). వారి యొక్క శాప విమోచనం కొఱకు సుబ్రహ్మణ్యుని ఆరాధించడం మొదలు పెడతారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుప్పరంకుండ్రం వచ్చినప్పుడు వారికి శాప విమోచనం కలుగుతుందని వారికి తెలియచేయబడుతుంది.

తిరుచెందూర్ లో స్వామి సూర పద్మం అనే రాక్షసుడి సంహారం చేసిన తరువాత, మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుంచి విముక్తులను చేసి, ఆ దేవతలందరితో కలిసి, తిరుప్పరంకుండ్రం వస్తారు. స్వామి యొక్క రాకతో పరాశర మహర్షి కుమారులకు శాపవిమోచనం కలిగి, స్వస్వరూపం వచ్చి, వారు స్వామిని ఆ క్షేత్రములో కొలువుండమని ప్రార్ధిస్తారు. వారి ప్రార్ధనకు మెచ్చిన షణ్ముఖుడు అంగీకరించగా, అక్కడ విశ్వకర్మ ఒక చక్కని ఆలయం నిర్మిస్తారు. అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయాని ని పెళ్ళిచేసుకోమని సుబ్రహ్మణ్యుని అర్ధిస్తారు. అక్కడే ఉన్న చతుర్ముఖ బ్రహ్మ గారికి, శ్రీ మహా విష్ణువుకి తన ఈ కోర్కెని తెలియజేస్తాడు ఇంద్రుడు. బ్రహ్మ గారు, నారాయణుడు కూడా చాలా సంతోషించి, సుబ్రహ్మణ్యునికి తెలుపగా, స్వామి అంగీకరిస్తారు.
సుబ్రహ్మణ్య స్వామి వారికి, దేవయాని అమ్మకు కళ్యాణం ఈ తిరుప్పరంకుండ్రం లోనే జరిగింది. శివ పార్వతులు, లక్షీనారాయణులు, సరస్వతీ బ్రహ్మలు, సకల దేవతల సమక్షంలో ఈ కళ్యాణం జరిగింది. ఇక్కడ స్వామి వారి కళ్యాణం జరగడం వల్లనే ఇప్పటికీ ఎంతో మంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు.
రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా చాలా విశేషమైనది.

ఈ క్షేత్రమును చేరే మార్గములు:
తిరుచెందూర్ తమిళనాడు లోని మధురై సమీపంలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
రోడ్ ద్వారా: చెన్నై  - 450 Km, బెంగళూరు – 470 Km దూరంలో ఉన్నాయి. అనేక తమిళనాడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి.
రైలు ద్వారా: చెన్నై నుంచి మధురై కి ఎన్నో రైళ్ళు నడుస్తాయి. (ఉదాహరణకి వైగై ఎక్స్ ప్రెస్, ఇది మన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లాంటి ట్రైన్. చెన్నై లో మధ్యాహ్నం 12.45 కి బయలుదేరి మధురై రాత్రి 8.50 కి చేరుకుంటుంది.)
విమానము ద్వారా: దగ్గరలో అంతర్జాతీయ విమానాశ్రయము చెన్నై (470 Km), అది కాక జాతీయ విమానాశ్రయము మధురై లోనే మీనాక్షీ అమ్మ వారి ఆలయం నుండి 10 Km దూరంలో ఉంది.

వసతి సదుపాయము:
ఈ క్షేత్రము మదురైకి దగ్గరగా ఉండడం వల్ల, వసతి ఏర్పాటు మధురైలోనే చూసుకోవచ్చు. మధురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి. కాస్త మంచివి కావాలంటే, Tamil Nadu Tourism Development Corporation (TTDC) వాళ్ళ హోటళ్ళు రెండు ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి. వీటిలో మధురై – 1 అనే హోటల్ అమ్మ వారి ఆలయమునకు చాలా దగ్గరలో ఉంది. ఇది West Veli Street లో ఉంది. మేము వెళ్ళినప్పుడు ఇందులోనే ఉన్నాము. ఈ హోటల్ బుకింగ్ ఇంటర్నెట్ లో చేసుకోవచ్చు. TTDC వాళ్ళ వెబ్ సైట్ లంకె క్రింద ఇస్తున్నాను.


ఆలయంలో ఆర్జిత సేవలు:
ప్రతీ రోజూ స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం జరుగుతుంది. దీనికి కొంచెం ధరలో టికెట్టు ఉంటుంది, మనం కూడా పాలు, తేనె మొదలైన వస్తువులు తీసుకువెడితే, వాటితో కూడా స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం చేస్తారు.

క్షేత్రము యొక్క చిరునామా:

స్వామి గురించి వ్రాసిన ఈ టపాలో ఏమైనా దోషములు ఉంటే ఆ షణ్ముఖుడు నన్ను క్షమించు గాక.


సర్వం శ్రీ వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యార్పణమస్తు.

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు – తిరుచెందూర్


ఆరు పడై వీడు – ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు:

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ

పార్వతీ దేవి కరుణామయి, అనుగ్రహరాశి, మరి తండ్రి శంకరుడో ఉబ్బులింగడు, ఆయనా అనుగ్రహ రాశి..... ఈ ఇద్దరి అనుగ్రహాల కలపోత మన బుజ్జి సుబ్రహ్మణ్య స్వామి వారు.

ఈ ఆరు క్షేత్రములు సుబ్రహ్మణ్యుని ఆరు ముఖములుగా పురాణములు చెప్తున్నాయి. ఈ ఆరు దివ్యమైన క్షేత్రములను తమిళనాడు లో ఆరుపడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రములలో సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రతీ చోటా రాక్షస సంహారం చేసేముందు విడిది చేసిన ప్రదేశములుగా ప్రఖ్యాత తమిళ కవి శ్రీ నక్కీరన్ కీర్తించారు. ఈ ఆరు క్షేత్రములు వరుసగా
1.     తిరుచెందూర్
2.   తిరుప్పరంకుండ్రం
3.   పళముదిర్చొళై
4.   పళని
5.    స్వామిమలై
6.   తిరుత్తణి

అమ్మవారి అనుగ్రహము వలన, 2008 లో మేము తమిళనాడు యాత్రలకు వెళ్ళినప్పుడు పళని స్వామి దర్శనం అయ్యింది. అప్పుడు ఈ ఆరు క్షేత్రముల గురించి మాకు తెలిసింది. తరువాత పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు “శివ పురాణము” ప్రవచనములో ఈ ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రముల గురించి వివరముగా తెలియజేయడం వలన ఈ సంవత్సరం 2011 మాఘ మాసములో ఈ ఆరు క్షేత్రములను దర్శించే భాగ్యం మాకు కలిగింది. స్వామి వారి ఆరు ముఖముల దర్శన భాగ్యము ద్వారా పొందిన ఆనందాన్ని, సుబ్రహ్మణ్య కటాక్షమును అందరితోనూ పంచుకోవాలని, “ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు” అనే శీర్షికన ఈ క్షేత్రముల గురించి వ్రాద్దామని చేస్తున్న చిన్ని ప్రయత్నం. 

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఈ ఆరుపడై వీడు క్షేత్రముల యందు తనని సేవించిన వారిని విశేషముగా అనుగ్రహిస్తారు. ఈ ఆరు క్షేత్రములలో ఒకో రూపములో స్వామి భక్తులను అనుగ్రహిస్తారు. సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ ఎక్కువగా కొండమీదే ఉంటాయి. ఇప్పటికీ ఆది శంకరాచార్యుల సాంప్రదాయ పీఠాధిపతులు అయిన జగద్గురువులు వారు పీఠాన్ని అధిరోహించే ముందు తప్పని సరిగా ఒక సారి ఈ ఆరుపడై వీడు క్షేత్రములను పాదచారులై దర్శించి వస్తారు అని విన్నాను. సుబ్రహ్మణ్య అనుగ్రహము తోనే అటు శ్రీ విద్యా ఉపాసనలో అయినా, ఇటు జ్ఞానములో అయినా ఒక స్థాయిలోకి వెళ్ళడం సాధ్యం అని పెద్దలు చెప్తారు.  
నాగదోషం ఉన్న వారు ఎవరైనా ఈ ఆరు క్షేత్రముల దర్శనం చేస్తే ఆ దోషం పోయి ఇష్ట కామ్యములు నెరవేరుతాయి. అంతేకాక, కుజ గ్రహమునకు అధిపతి సుబ్రహ్మణ్యుడు. ఆయన పాదములు పట్టి ప్రార్ధిస్తే కుజదోషం తొలగి పోతుంది. ఇవ్వాళ దేశంలో అనేక ప్రమాదాలు జరగడానికి కారణం ఈ కుజ దోషం వల్లనే. కుజ దోషం పోవాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన వల్లనే సాధ్యం అని పెద్దలు చెప్తారు. అటువంటి సుబ్రహ్మణ్యుని దివ్య క్షేత్రముల మహిమ ఎంతటిదో మనం ఊహించవచ్చు.

ఈ టపాలో తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి వారి గురించి వివరిస్తాను. స్వామి గురించి చేసే ఈ వర్ణనలో ఏమైనా దోషములు ఉంటే ఆ షణ్ముఖుడు నన్ను క్షమించు గాక.

తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి:

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది తిరుచెందూర్. ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఇక్కడే మామిడి చెట్టు రూపములో పద్మాసురుడు (సూర పద్మం) అనే రాక్షసుడు వస్తే, సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా, ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణము చెబుతోంది.

"తిరుచెందూర్" లో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర మరియు సూర పద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారు. అందుకే ఇక్కడ, స్వామి తన ముద్దులొలికే రూపం తోటి పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రము. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో అంత శక్తివంతమై, అంతటి సుందరమైన దివ్య క్షేత్రం మునుపెన్నడూ చూడలేదు.


ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో. అది చూసి తీరాలి.  సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్ లో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది.

ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒక సారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు. ఈ భుజంగ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి . దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్ఠ రోగం మొదలైనవి. అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.  దీనిని ప్రతీ ఇంటిలో యజమాని రోజూ చదువుకోవాలి. ఈ భుజంగం ప్రభావము వలన మనకి ఉన్న సకల దోషములు పోయి మనసు ప్రశాంతత పొంది, మంచి బుద్ధి వచ్చి, ఇష్టకామ్యములు (ధర్మబద్ధమైన) నెరవేరుతాయి. 


ఈ సంసారము అనే మహా సముద్రము నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “మహాంబోధితీరే మహాపాపచోరే ..... అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో. అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది.

తిరుచెందూర్ క్షేత్రం యొక్క మరొక లీల ఏమిటంటే (అక్కడ ప్రజలు చెప్పగా విన్నాము), 2006 లో వచ్చిన సునామి వల్ల, ఇక్కడ ఎవరికీ హాని జరగలేదు కదా, కనీసం తిరుచెందూర్ దేవాలయాన్ని తాకనైనా లేదు. అది స్వామి వారి శక్తి.



తిరుచెందూర్ విభూతి మహిమ:
ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవ్యాధులు నయం అవుతాయి. ఎంతో మందికి అనుభవములోకి వచ్చాయి స్వామి వారి లీలలు. నమ్మిన వాడికి నమ్మినంత....అన్నారు పెద్దలు.

ఈ క్షేత్రమును చేరే మార్గములు:
తిరుచెందూర్ తమిళనాడు లోని Tuticorin జిల్లాలో ఉంది.
రోడ్ ద్వారా: ట్యూటికోరిన్ - 40Km, తిరునెల్వేలి – 60Km, కన్యాకుమారి – 90Km, మదురై – 175Km దూరంలో ఉన్నాయి. అనేక తమిళనాడు ఆర్టీసీ వారి బస్సులు అనేకం నడుస్తాయి.
రైలు ద్వారా: చెన్నై నుంచి తిరునెల్వేలి దాకా, అనేక రైళ్ళు ఉన్నాయి. (ఉదాహరణకి కన్యాకుమారి ఎక్సప్రెస్) తిరునెల్వేలి నుంచి అనేక బస్సులు, కార్లు దొరుకుతాయి.
విమానము ద్వారా: దగ్గరలో అంతర్జాతీయ విమానాశ్రయము చెన్నై (617Km), అది కాక జాతీయ విమానాశ్రయము ట్యూటికోరిన్ లో (40Km) ఉంది. 

వసతి సదుపాయము:
ఈ క్షేత్రములో ఆలయ దేవస్థానము వాళ్లవి అనేక గెస్ట్ హౌసులు రోజుకి Rs.115/- నుంచి Rs. 350/- దాకా ఉంటాయి. ఇవి ముందుగా ఆలయం వారి వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇంతే కాక అనేక ప్రైవేటు హోటళ్ళు కూడా ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు ఉన్న హోటల్ ఉదయం ఇంటర్నేషనల్.

ఆలయంలో ఆర్జిత సేవలు:
స్వామి వారి అభిషేకము కోసం పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ క్షేత్రము వెడితే ఈ అభిషేకం తప్పక దర్శించగలరు. అద్భుతం గా ఉంటుంది. ఇవి కాక ఇంకా అష్టోత్తర అర్చన, సహస్రనామ అర్చన మొదలైన సేవలు ఉన్నాయి.

క్షేత్రము యొక్క చిరునామా:
Joint Commissioner/Executive Officer
Arulmigu SubramaniaSwamy Temple,   
Tiruchendur - 628 215.   
Phone Numbers : 04639-242221, 04639-242270, 04639-242271

సర్వ వ్యాపకుడు, సర్వ నియంత, దేవసేనాపతి, పార్వతీ పరమేశ్వరుల గారాల బిడ్డడు, వల్లి, దేవయాని అమ్మల నాథుడు అయిన మన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అండ ఉండగా మన ఎవరికీ బెంగ లేదు. ఇంతటి శక్తివంతమైన క్షేత్రం దర్శనం చేయించిన సుబ్రహ్మణ్య స్వామి వారికి, భగవంతుడి యందు గురిని చూపించి మాలో విశ్వాసాన్ని పెంచి, మూల కారణమైన మన పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి మా సాష్టాంగ ప్రణామములు.


సర్వం శ్రీ వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యార్పణ మస్తు.